తెలుగులో అతిపెద్ద ఫ్లాప్ సినిమా 70 ఏళ్ళ క్రితమే వచ్చింది... దాన్ని ఏ సినిమా బీట్ చెయ్యలేదు!
on Mar 29, 2024
ఒక సినిమా నిర్మాణం వెనుక ఎన్నో కష్టాలు, మరెన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకొని లక్షల రూపాయలు వెచ్చిస్తేగానీ ఒక సినిమా పూర్తి కాదు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది కాబట్టి టెక్నీషియన్స్‌కి కలిగే ఇబ్బందులు తక్కువనే చెప్పొచ్చు. అయితే కొన్ని సినిమాలకు అవి కూడా ఎక్కువే. ఏ నిర్మాత అయినా డబ్బు సంపాదించాలనే సినిమా తీస్తాడు, పోగొట్టుకోవాలని ఎవ్వరూ సినిమా తియ్యరు. సినిమా కోసం నిర్మాత ఖర్చుపెట్టే డబ్బుకి ఎంతో కొంత లాభం వస్తే నిర్మాత సంతోషిస్తాడు. అలా కాకుండా పెట్టిన ఖర్చు మాత్రమే వెనక్కి వచ్చినా అతనికి సంతోషమే. ఎందుకంటే ఆ డబ్బుతో మరో సినిమా చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పెట్టిన డబ్బులో ఒక్క రూపాయి కూడా వెనక్కి రాకపోతే ఆ నిర్మాత పరిస్థితి ఏమిటి? ఇదంతా సినిమానే నమ్ముకొని, సినిమాయే జీవితంగా ఉండే నిర్మాతలకు వర్తిస్తుంది. కానీ, కొందరు సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేకపోయినా డబ్బు ఉంది కదా అని సినిమా నిర్మాణంలోకి దిగితే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానమే 70 సంవత్సరాల క్రితం విడుదలైన ‘ప్రపంచం’ అనే సినిమా.
1953లో విడుదలైన ‘ప్రపంచం’ సినిమా రూ.30 లక్షల బడ్జెట్‌తో నిర్మించారు. ఆరోజుల్లో ఒక సినిమాకి రెండు, మూడు లక్షలకు మించి బడ్జెట్ ఉండేది కాదు. అలాంటిది రూ.30 లక్షలు ఒక్క సినిమాకే ఖర్చు చేశారంటే అది మామూలు విషయం కాదు. సాధారణంగా పౌరాణిక సినిమాలు, జానపద చిత్రాలకు కొంత బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అందులో సెట్టింగ్స్ ఉంటాయి. కానీ, ‘ప్రపంచం’ అనే సినిమా పూర్తి సాంఘిక చిత్రం. అయినా 50కి పైగా సెట్టింగ్స్ వేశారు. ఈ సినిమాకు 160 మంది నటీనటులు పనిచేశారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ సినిమా పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. సినిమాలో నటించిన ఆర్టిస్టులందరికీ వారు తీసుకునే పారితోషికానికి ఎన్నో రెట్లు అధికంగా చెల్లించారు. ఈ సినిమా పూర్తి కావడానికి 2,50,000 అడుగుల ఫిలింను ఖర్చు చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఎన్ని రీ షూట్లు జరిగాయో లెక్కే లేదు. అప్పట్లోనే 101 థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా ఇది. ఈ సినిమా పబ్లిసిటీని హెలికాప్టర్ల ద్వారా చేసి సినిమా ప్రమోషన్‌లో అప్పట్లోనే కొత్త పుంతలు తొక్కారు. ఇంకా ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇలాంటి సినిమా చెయ్యాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి? అసలు ఈ సినిమా ఎలా మొదలైంది అనే వివరాల్లోకి వెళితే..
అతని పేరు మునాస్. 1915లో శ్రీలంకలోని కొలంబోలో పుట్టాడు. అతని పూర్వీకులు అందరూ రాజకీయాల్లో ఆరితేరిన వాళ్ళు. మునాస్‌కి చిన్నప్పటి నుంచి చదువు కంటే రాజకీయాలంటేనే ఎక్కువ ఇష్టం. అతను పెద్ద వాడైన తర్వాత బిజినెస్ రంగంలో బాగా రాణించాడు. అప్పట్లోనే లక్షలు సంపాదించాడు. అతనికి ఇంగ్లీష్, తమిళ సాహిత్యాలు బాగా ఇష్టం. అతను చూసిన తొలి తమిళ సినిమా ‘సావిత్రి సత్యవాన్’. ఆ సినిమాను 79 సార్లు చూశాడు. అతనికి అంతగా నచ్చిందా సినిమా. దాంతో తను కూడా ఒక మంచి సినిమా తియ్యాలనుకున్నాడు. ఈ విషయం తన భార్యకు చెప్పాడు. ఆమె సినిమా కోసం కథ రాస్తానని చెప్పింది. ఆ కథ మునాస్‌కి బాగా నచ్చింది. సినిమా తియ్యడం కోసం భార్య, పిల్లలతో మద్రాస్ చేరుకున్నాడు. ఒక పెద్ద డైరెక్టర్‌ని పిలిపించి కథ చెప్పాడు. ఆ డైరెక్టర్‌కి కథ నచ్చలేదు. అందులో చాలా పాత్రలు ఉన్నాయి. చాలా సెట్స్ వెయ్యాల్సిన అవసరం ఉంది. కథ మారుద్దాం అన్నాడా డైరెక్టర్. కానీ, మునాస్ వినలేదు. ఇదే కథను చాలా మంది డైరెక్టర్లకు వినిపించాడు. ఎవరికీ నచ్చలేదు. చివరికి దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి శిష్యుడు రామచంద్రన్ ఈ సినిమాను చేసేందుకు ముందుకు వచ్చాడు. తెలుగులో ‘ప్రపంచం’ పేరుతో, తమిళ్‌లో ‘ఉళగం’ పేరుతో ద్విభాషా చిత్రంగా ప్రారంభమైంది. తమిళ్ వెర్షన్‌కు మునాస్ డైలాగులు రాశాడు. తెలుగు వెర్షన్‌కు శ్రీశ్రీ మాటలు రాశారు. సినిమాలో 16 పాటలు ఉన్నాయి. అందులో ఆరుద్ర ఒక పాట రాయగా, మిగతా పాటలన్నీ శ్రీశ్రీ రాశారు.
ఈ సినిమాలో కాంచన, జి.వరలక్ష్మీ, వల్లం నరసింహారావు, షావుకారు జానకి, రామశర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నాగయ్య అతిథి పాత్ర పోషించారు. రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొన్న నాగయ్యకు రూ.25వేలు పారితోషికం ఇచ్చారు. అప్పటికి అది చాలా చాలా ఎక్కువ. వీరు కాక మరెన్నో పాత్రలు సినిమాలు ఉన్నాయి. వేలల్లో జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఆర్టిస్టుల పారితోషికాలకే కొన్ని లక్షలు ఖర్చయింది. షూటింగ్ పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. ఈ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ చేశారు. ఆ బాధ్యతను హాలీవుడ్‌కి చెందిన కిమర్ కంపెనీకి అప్పగించారు. మొట్టమొదటిసారి హెలికాప్టర్ ద్వారా పబ్లిసిటీ చేసిన సినిమా ఇదే. ఇవన్నీ జనాన్ని బాగా ఆకర్షించాయి. 1953లో ఈ సినిమా రిలీజ్ అయింది. థియేటర్లకు జనం తరలి వచ్చారు. కానీ, సినిమా మొదలైన పది నిమిషాలకే ప్రేక్షకులకు పరిస్థితి అర్థమైంది. ఏ సీన్ ఎందుకు వస్తుందో, ఏ పాత్ర ఎందుకు వస్తుందో అర్థం కాక జనానికి పిచ్చెక్కింది. అది 5 తరాలకు సంబంధించిన కథ కావడంతో అంతులేని కథలా సాగుతూనే ఉంటుంది. దీంతో జనానికి చిర్రెత్తుకొచ్చింది. సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూశారు. సినిమా పూర్తయి థియేటర్ డోర్స్ తియ్యగానే ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు. మరుసటి రోజు ఒక్కరు కూడా సినిమా చూసేందుకు రాలేదు. అలా నిర్మాత మునాస్ పెట్టిన లక్షల్లో ఒక్క రూపాయి కూడా అతనికి తిరిగి రాలేదు. అయినా అతను బాధ పడలేదు. ఆ తర్వాత దేవసుందరి అనే మరో సినిమాను 5 భాషల్లో నిర్మించారు. ఇది పూర్తి కావడానికి 9 ఏళ్ళు పట్టింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ రెండు సినిమాల కోసం 14 సంవత్సరాలు మద్రాస్‌లోనే ఉండిపోయిన మునాస్ ఆ తర్వాత శ్రీలంక వెళ్లిపోయారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘ప్రపంచం’ చిత్రానికి ఉన్న రికార్డును బ్రేక్ చేసే సినిమా ఎప్పటికీ రాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read